టీపీసీసీ పదవులకి 13 మంది రాజీనామా
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇటీవల పార్టీ అధినాయకత్వం ప్రకటించిన కొత్త కమిటీలు తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పదవులకు కొందరు రాజీనామాలు కూడా చేశారు. మరోవైపు సీనియర్ల కామెంట్స్ నేపథ్యంలో.. రేవంత్ వర్గంగా భావిస్తున్న సీతక్క సహా మరో 12 మంది వారి పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కు లేఖలు రాశారు. వలస నేతల వల్లే పదవులు రాలేదని సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలపై వీరు మనస్థాపానికి గురై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఏ పదవి లేకున్నా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తామని తెలిపారు.
పీసీసీ కమిటీల నియామకంపై పలువురు సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగా వినిపించిన నేపథ్యంలో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ కమిటీలో చోటు లభించిన 13 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పీసీసీ కమిటీలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ నేతలు విమర్శించిన నేపథ్యంలో దనసరి అనసూర్య అలియాస్ సీతక్క, విజయరామారావు, వేం నరేందర్ రెడ్డి, ఎర్ర శేఖర్, చారగొండ వెంకటేశ్, జంగయ్య యాదవ్, డి. సాంబయ్య, డాక్టర్ సత్యనారాయణ, పటేల్ రమేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, సత్తు మల్లేష్ తదితరులు రాజీనామా చేశారు. దీంతో టీ కాంగ్రెస్ రెండుగా చీలి పోయింది.