అమరావతి : సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న స్కూళ్లల్లో విద్యార్థుల హాజరు గణనీయంగా పెరుగుతుందని, ప్రశాంతంగా తరగతులు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు కూడా స్కూళ్లకు ఆసక్తిగా హాజరవుతున్నారని అన్నారు. మొదటి రోజు 61 శాతం హాజరు కాగా గురువారం నాటికి 81 శాతంకు విద్యార్థుల హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలోని అనంతపురం 85 శాతం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 84 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరువుతున్నారన్నారు. స్కూళ్లల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సురేష్ తెలిపారు.