కొత్త పేస్కేల్స్ అమలుపై మార్గదర్శకాలు పెండింగ్ డీఏలతో కలిపి 1వ తేదీన జీతాలుఅమరావతి: కొత్త పీఆర్సీకి అనుగుణంగా ఉద్యోగుల పేస్కేల్స్ నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేశారు. ప్రస్తుతమున్న బేసిక్ పే, 2018 జూలై 1 వరకు ఉన్న డీఏలు(30.392 శాతం), 23 శాతం ఫిట్‌మెంట్‌ను కలిపి బేసిక్ పే నిర్ధారించాలని ఆదేశించారు. కొత్తగా ప్రకటించిన హెచ్ఆర్ఏలు, సీసీఏ మినహాయించి అమలు చేయాలని స్పష్టం చేశారు.
మారిన పే స్కేల్స్‌ను 2018 జూలై 1 నుంచి నోషనల్‌గా తీసుకుని.. 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు చేయాలని సూచించారు. మారిన పేస్కేల్స్ ప్రకారం కొత్త జీతాలను ఫిబ్రవరి 1న ఐదు పెండింగ్ డీఏలతో కలిపి ఇవ్వాలని స్పష్టం చేశారు. పేస్కేల్స్‌కి సంబంధించిన అన్ని వివరాలను ఏపీ గెజిట్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పేస్కేల్స్ కోసం ఏపీసీఎఫ్ఎస్ఎస్ హెచ్ఆర్ఎంఎస్లో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.