ఆటలో అపశృతి..200 మందికి గాయాలు
వరంగల్ టైమ్స్, తిరువనంతపురం : కేరళలోని మలప్పురంలో పెను ప్రమాదం తప్పింది. ఫుట్ బాల్ టోర్నీ సందర్భంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక గ్యాలరీ కూలిపోయింది. దీంతో 200 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మలప్పురంలోని పూన్ గోడ్ లో ఉన్న ఎల్పీ స్కూల్ లో ఆల్ ఇండియా సెవన్స్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శనివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా స్కూల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. అయితే మ్యాచ్ చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. పరిమితికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చోవడంతో అది కుప్పకూలిపోయింది. దీంతో 200 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా, మ్యాచ్ చూడటానికి 8 వేల మందికి పైగా వచ్చారని, గాయపడిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది. వారిలో సగం మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించారని, 15 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించింది.