35 ఏళ్లు నిండితే ఇంటికే

35 ఏళ్లు నిండితే ఇంటికే..
ఉత్తర్వులు జారీచేసిన సంస్థ కమిషనర్‌అమరావతి : సీఎం వైఎస్​ జగన్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల అమలులో భాగంగా నియమించిన వలంటీర్లకు 35 ఏళ్ల వయస్సు నిండితే ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారితోపాటు 35 ఏళ్లు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ఈ ప్రకటనతో ఒక్కసారిగా వలంటీర్లు ఉలిక్కిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో హడావుడిగా వలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమిస్తూ రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వలంటీర్లను నియమించారు. ఈ సంఖ్య జిల్లాలలో 30 వేలకు పైబడే ఉంది. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలు ఉల్లంఘించి వలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి. నిబంధనలు అనుసరించి 35 ఏళ్లు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వలంటీరును ఉద్యోగం నుంచి తొలగింపు చేస్తారు .ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వలంటీర్లలో ఆందోళన నెలకొంది.