వరంగల్ టైమ్స్,హైదరాబాద్: యూట్యూబర్ సరయుతో పాటు ఆమె టీంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ స్పెక్టర్ పూసపాటి శివచంద్ర వివరాలు తెల్పారు. సరయు, ఆమె టీం ‘7 ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ‘7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ‘ కోసం లఘు చిత్రం రూపొందించి 2021, ఫిబ్రవరి 25న తన ఛానల్ తో పాటు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రంలో సరయు, ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించారు.
అయితే ఆ వీడియో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో పాటు మద్యం తాగి హోటల్ కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సిరిసిల్ల ఠాణా ఇన్ స్పెక్టర్, బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్ లో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో యూట్యూటర్ సరయూను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.