డీకే అరుణ కూతురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూతురు శృతి రెడ్దిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎలీషాబాబు అనే వ్యక్తిని దూషించారనే అభియోగాలతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. డీకే శృతి రెడ్ది, వినోద కైలాస్ లపై కేసు నమోదైంది. ఐపీసీ 323, 336, 341, 384, 448, 506 రెడ్ విత్ (R/W)34,ఎస్సీ,ఎస్టీ పీఓఏ యాక్ట్ 3(C),3(r),3(s)సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బంజారాహిల్స్ లోని పీవీపీ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేస్తున్న తమను శృతి రెడ్ది దూషించారని ఎలీషా బాబు ఫిర్యాదు చేశారు.

ఇంటిస్థలం విషయమై గత కొంతకాలంగా వైసీపీ నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), డీకే అరుణ కూతురు శృతి రెడ్ది మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. తన ఇంటిపై దౌర్జన్యం చేశారని గోడ కూలగొట్టేందుకు ప్రయత్నించారంటూ పీవీపీపై శృతి రెడ్ది ఫిర్యాదు చేయడంతో జనవరి 19న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన ఇంటిపైకి మనుషులను పంపించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై కేసులు నమోదు కావడంపై పీవీపీ కూడా స్పందించారు. కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. వంద కేసులు పెట్టినా తాను పట్టించుకోనన్నారు. బంజారా హిల్స్ లోని కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై శృతి రెడ్ది దూషించి, బెదిరించినట్టు ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. హై కోర్టు ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. కోర్టు ఆర్డర్స్ చూపించిన తర్వాతే తమ స్థలంలో పనులు చేపట్టామని ఆయన తేల్చి చెప్పారు. ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టడమే వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. పైగా బాధితుడు పోలీసులకు , కోర్టుకు పక్కా ఆధారాలు సమర్పించాడు.