తన మనస్సులోని మాటను చెప్పిన ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : నా 40 యేండ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి గొప్ప సీఎంను చూడలేదని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగం అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ చేస్తున్న, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఇంతగా ప్రజల కోసం పనిచేస్తున్న సీఎంను నేనెన్నడూ చూడలేదని అన్నారు. జనగామ ప్రాంతానికి దేవాదుల నీటిని తరలించి అపర భగీరథుడుగా నిలిచారని, ప్రతీ తండాలో మిషన్ భగీరథ మంచినీళ్లు తాగిస్తున్నారని, ఒక పంటకు దిక్కులేని చోట 2 పంటలకు సరిపడా సాగు నీరు అందిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్ ను కొనియాడారు.

పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మీరు చేసిన పనులు మా మనసుల్లో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. వాటి ఫలితాలను మేము అందుకుంటున్నామని తెలిపారు. ఎన్నో అద్భుతాలు మీరు చేశారు. మాకు జనగామ జిల్లా ను ఇచ్చారు. 65.29 కోట్లతో నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించి ఇచ్చారు. పార్టీ భవనాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ దయ వల్ల మా రిజర్వాయర్లకు రూ.350 కోట్లు ఇచ్చారు. పలు రిజర్వాయర్ లు కట్టిస్తున్నరు. రానున్న కాలంలో మా ప్రాంతానికి కరువు లేకుండా, రాకుండా చేశారని దయాకర్ రావు గుర్తు చేశారు. వల్మిడి, పాలకుర్తి, బమ్మెర దేవాలయాల అభివృద్ధి మీ పుణ్యాన జరుగుతున్నదని తెలిపారు.

ఇక మాకు జనగామలో మెడికల్ కాలేజ్ ప్రకటించాలి. పాలకుర్తిలో జూనియర్, డిగ్రీ కాలేజ్ లు కావాలి. ఒక 100 పడకల హాస్పిటల్ కావాలి. స్టేషన్ ఘనపూర్ కి డిగ్రీ కాలేజీ కావాలి. సన్నూరు దేవాలయం భూమి దాదాపు వెయ్యి ఎకరాలు అనేకమంది చాలా ఏళ్లుగా దున్నుకుంటున్నరు. వాళ్లకు ఆ భూములు చెందేటట్లుగా ఆదేశాలు ఇవ్వాలి. సన్నూరు దేవాలయం అభివృద్ధికి 10 కోట్లు ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ వంటి పాలనాదక్షత ఉన్న వ్యక్తి లేడని, దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ కు అండగా నిలుస్తామని దయాకర్ రావు అన్నారు. దేశం కోసం కేసీఆర్ చేసే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని సభా వేదికగా మంత్రి దయాకర్ రావు తెలిపారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్ రావు హామీలను స్వీకరించి ఖచ్ఛితంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.