అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం: ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ గ్రామ శివారులో శ్రీసమ్మక్క-సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ యేడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరుగనుంది. ఈ సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు.

అనంతరం జాతర నిర్వహణపై జాతర ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తర్వాత అత్యంత వైభవంగా అగ్రంపహాడ్ శ్రీసమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. సుమారు 30 లక్షల మందికి పైగానే భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే గతంలో జరిగిన జాతరలో ఏర్పాటు చేసిన వసతుల కంటే ఈ సారి మెరుగైన వసతులతో ఈ సంవత్సరం జాతర నిర్వహణ జరగాలని ఎమ్మెల్యే చల్లా అధికారులను ఆదేశించారు.

గతంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్, వాటర్ సప్లై, శానిటేషన్, క్యూ లైన్స్ , ఆర్టీసీ బస్సుల సౌకర్యం, తదితర ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏర్పాట్లలో లోటు ఉండకుండా భక్తులతో మెరుగైన వసతుల మధ్య అమ్మవార్లను దర్శించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులను సూచించారు. ఎమ్మెల్యే సూచనలు, ఆదేశాలను స్వీకరించిన వివిధ శాఖల అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు భక్తుల కోసం సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో కంటే మెరుగైన వసతులు ఏర్పాటు చేసి, భక్తులు అమ్మవార్ల మొక్కులు చెల్లించుకునేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.