వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : రేపటి నుండి కేయూ-ఆర్ఈసీ వంద ఫీట్ల బైపాస్ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి తెలిపారు. రేపటి నుండి ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో కేయూ-ఆర్ఈసీ వంద ఫీట్ల బైపాస్ మార్గంలో కుడిపైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి పనులు ప్రారంభమవుతున్న దృష్ట్యా పనులు జరిగే ప్రాంతం నుండి వెళ్ళే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లుగా సీపీ బుధవారం ఉత్తర్వులను జారీచేశారు.ఈ వాహనాల మళ్లిపు ఫిబ్రవరి 24 నుండి మే 31 వరకు కొనసాగుతుందని సీపీ తెలిపారు.
వడ్డేపల్లి చర్చ్ జంక్షన్ నుండి కేయూసి వెళ్ళే వాహనాలు ఇలా…
వడ్డేపల్లి చర్చ్ జంక్షన్ నుండి కేయూసి వెళ్ళే వాహనాలు జవహర్ నగర్ కాలనీ క్రాస్ రోడ్, మారుతీ నగర్, గోపాల్పూర్ కల్లుమండవా నుండి కుడి వైపు నుండి గోపాల్పర్ గ్రామ పంచాయితీ, క్రాస్ రోడ్ మీదుగా కేయూసి క్రాస్ కు చేరుకోవాల్సి వుంటుంది.
కేయూసి జంక్షన్ నుండి వడ్డేపల్లి జంక్షన్ వరకు వెళ్ళే వాహనాలు ఇలా…
గోపాల్ పూర్ క్రాస్, గోపాల్ పూర్ గ్రామపంచాయితీ, కల్లు మండువా, మారుతీనగర్, జవహర్ నగర్ కాలనీ, క్రాస్, వడ్డేపల్లి జంక్షన్‌కు చేరుకోవాల్సి వుంటుంది.
కాజీపేట నుండి కేయూసి వెళ్ళే వాహనాలు ఈ విధంగా..
ఫాతీమానగర్, నిట్ కళాశాల, అదాలత్ సెంటర్, కాళోజీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, సిపిఓ సెంటర్ మీదుగా కేయూసి జంక్షన్‌కు చేరుకోవాలి. అదే విధంగా కేయూసి నుండి కాజీపేట వెళ్ళే వాహనాలు ఇదే మార్గాన్ని అనుసరించాల్సి వుంటుంది. కావున ప్రజలు, వాహనదారులు ఈ మళ్లింపును దృష్టిలో వుంచుకుని అధికారులకు సహకరించగలరని సీపీ తరుణ్ జోషి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.