జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే నేమ్ స్టిక్కర్ కారు బీభత్సం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బోధన్ ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న ఓ కారు జూబ్లీహిల్స్ లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర మాసాల పసికందు మృతి చెందగా, ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. స్థానికులు మరియు జూబ్లీహిల్స్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్ నుంచి టీఆర్ నంబర్ తో ఉన్న మహీంద్రా థార్ వాహనం తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని బ్రిడ్జిని దాటి, రోడ్ నంబర్ 1/45 కూడలి వైపు వేగంగా వస్తోంది. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. అక్కడే తమ పిల్లలను ఎత్తుకొని బుడగల విక్రయిస్తున్న మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టింది. దీంతో కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణబీర్ చౌహాన్, సారిక చౌహాన్ చేతుల్లో ఉన్న యేడాది వయసున్న అశ్వతోష్ సైతం కిందపడ్డారు.రణవీర్ చౌహాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మహిళలకు గాయాలు అయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి రోడ్ నంబర్ 1 వైపు పరారయ్యాడు. స్థానికుడు, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు గాయపడిన వారిని 108 వాహనంలో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రణబీర్ చౌహాన్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు.
ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కారుపై బోధన్ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ ఉంది. వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. షకీల్ ఆమెర్ పేరుతో ఉన్న కొన్ని పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే షకీల్ మాత్రం కారు తనది కాదని, మీర్జా అనే వ్యక్తికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఇచ్చినట్లు తెలిపాడు. ఈ ప్రమాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.