కాంగ్రెస్ లో హీటు పుట్టిస్తున్న సీనియర్ల సమావేశం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీనియర్ నాయకుల ప్రత్యేక సమావేశం కాంగ్రెస్ పార్టీలో హీటుపుట్టిస్తున్నది. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకులు హైదరాబాద్ లోని అశోకా హోటల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.దీంతో వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, శ్యామ్ మోహన్ రావు, కమలాకర్ రావుతో పాటు పలువురు నేతలు హోటల్ కు చేరుకున్నారు. అయితే సీనియర్ నేతలు ప్రత్యేక భేటీలు వద్దని పార్టీ అధినాయకత్వం సూచించింది. సమస్యలుంటే అధిష్టానానికి తెలపాలని సూచించింది. పార్టీ సూచనలు ధిక్కరించి సమావేశం కావద్దని ఏఐసీసీ హెచ్చరించింది. అయినప్పటికీ నాయకులు సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాగా తాము చేస్తున్నదాంట్లో తప్పేమీ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధిష్టానానికి తెలియచేయడమే తమ లక్ష్యమని చెప్పారు. పంజాబ్ తరహాలో పార్టీ నష్టపోవద్దనేదే తమ ఉద్దేశ్యమని వెల్లడించారు. ఇక తాను టీఆర్ఎస్ లోకి వెళ్తున్నట్లు మా పార్టీ నాయకులే ప్రచారం చేస్తున్నారని, నేను పార్టీ మారుతానని చెప్పే వాళ్లను చెప్పుతో కొడతానని జగ్గారెడ్డి హెచ్చరించారు.
రేవంత్ పార్టీని గెలిపించే మొగడా అంటూ మండిపడ్డారు. 2018లో రేవంత్ ఎందుకు ఓడిపోయాడని ప్రశ్నించాడు. నన్ను గెల్పించడానికి రేవంత్ ఎవరూ అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్, రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ కుమ్మక్కు అయ్యారని జగ్గారెడ్డి ఆరోపించారు. అధిష్టానానికి తప్పుడు నివేదిక ఇస్తున్న వారి గురించి అధిష్టానానికి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే లాభం ఉండదని ఆయన తెలిపారు.