ధాన్య, బియ్యం సేకరణ సాధ్యం కాదన్న కేంద్రం
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. లోక్ సభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారీ, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలువురు సభ్యులు ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రులు పీయూష్ గోయల్, ఆ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ధాన్యం సేకరణకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. కనీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్ లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితుల ఆధారంగానే సేకరణ జరుగుతుందని కేంద్రం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎఫ్ సీఐ, గోధమ, వరి ధాన్యాలను నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో కనీస మద్దతు ధరకు ముడి ధాన్యం సేకరణ జరుగుతుందని కేంద్రం పేర్కొన్నది. ఎఫ్ సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సేకరించిన ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించింది.