వరుసగా రెండో మ్యాచ్ లోను ఓడిన సన్ రైజర్స్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న జేసన్ హోల్డర్, చివరి ఓవర్లో మూడు వికెట్లతో విజృంభించడంతో సన్ రైజర్స్ వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమి చవి చూసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ , లక్నో బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేయలేకపోయింది. క్వింటన్ డీకాక్ (1), ఎవిన్ లూయిస్ (1), మనీష్ పాండే (11) తక్కువ స్కోర్లకే వెనక్కి పంపి ఒత్తిడి పెంచిన సన్ రైజర్స్ దీపక్ హుడా ( 51), కేఎల్ రాహుల్ (68) కి అడ్డుకట్ట వేయలేకపోయింది.వాళ్లిద్దరూ విజృంభించడంతో పాటు చివరల్లో కృనాల్ పాండ్యా (6), ఆయుష్ బదోని ( 19), జేసన్ హోల్డర్ (8) భారీ షాట్లు ఆడారు. అయితే డెత్ ఓవర్లలో సన్ రైజర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి బదోని, హోల్డర్ భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనను నెమ్మదిగా ఆరంభించిన సన్ రైజర్స్ ను ఆవేశ్ ఖాన్ తొలి దెబ్బ తీశాడు.
కేన్ విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ (13)ను వెనక్కి పంపారు. అయితే రాహుల్ త్రిపాఠి (44) రాణించడంతో సన్ రైజర్స్ గెలుపు వైపు సాగింది. కానీ ఎయిడెన్ మార్క్రమ్ (18) నుంచి అతనికి సహకారం అందించలేకపోయాడు. చివరిలో పూరన్ (34), వాషింగ్టన్ సుందర్ (18) కాసేపు గెలుపుపై ఆశలు కల్పించినా, అబ్దుల్ సమద్ (0), రొమేరియా షెఫర్డ్ (8) జట్టును ఆదుకోలేకపోయారు. చివరి ఓవర్లో సుందర్, షెఫర్డ్, భువనేశ్వర్ (1) వికెట్లు తీసిన హోల్డర్, సన్ రైజర్స్ ఆశలు నిరాశ చేశాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4, హోల్డర్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశారు.