కూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సుందర్ రాజ్
వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : కూడా చైర్మన్ గా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం హనుమకొండలోని కూడా కార్యాలయంలో ఉదయం 9. 30 ని.లకు బాధ్యతలను స్వీకరించారు. కూడా చైర్మన్ గా సుందర్ రాజ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదట మంత్రి కేటీఆర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించాలని భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ రాక కుదరలేదు. దీంతో ప్రమాణ స్వీకారం వాయిదా వేయకుండా నిర్ణయించుకున్న ప్రకారమే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ . ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత కూడా చైర్మన్ సుందర్ రాజ్ పై ఉందని మంత్రి దయాకర్ రావు అన్నారు. దేశంలో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలల్లో కూడా 5వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ నగరం పై ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా వరంగల్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతామమని, ఇందులో కూడా చైర్మన్ పాత్ర విశేషంగా ఉండాలని ఆయన సూచించారు.. త్వరలో నియో ప్రాజెక్టును నిర్మిస్తామని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రైతు ఋణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, చైర్మన్లు మెట్టు శ్రీనివాస్, మార్నేని రవీందర్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొని సుందర్ రాజ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు.