బస్సు ఛార్జీలు పెంచిన ఏపీఎస్ఆర్టీసీ
వరంగల్ టైమ్స్ , అమరావతి : ఏపీలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు బుధవారం ప్రకటించారు. డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్ సెస్ రూపంలో టిక్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై పల్లె వెలుగులో రూ. 2 , ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.5 పెంచినట్లు ఆయన వెల్లడించారు. ఇకపై గురువారం నుంచి పల్లె వెలుగులో కనీస టిక్కెట్ ధర రూ. 10 ఉంటుందని ఆయన ప్రకటించారు. డీజిల్ రేటు దాదాపు 60 శాతం మేర పెరిగిందని, నష్టాలను భరించడం సంస్థ వల్ల సాధ్యం కావడం లేదన్నారు.తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇవి పూర్తిగా డీజిల్ సెస్ మాత్రమేనని, టిక్కెట్ ధరల పెంపు మాత్రం కాదని ప్రయాణికులకు వివరణ ఇచ్చారు. గత రెండేళ్లలో ఆర్టీసీ ఆదాయం రూ. 2,680 కోట్లకు తగ్గిపోయిందని, నష్టాలను భరించడం సాధ్యం కావడం లేదని స్పష్టం చేశారు. ఈ డీజిల్ సెస్ పెంపు వల్ల ఆర్టీసీకి రూ. 720 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు.