నేడే శ్రీవారి ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు రిలీజ్
వరంగల్ టైమ్స్, తిరుమల : డిసెంబర్ 16 నుంచి 31 వరకు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబర్ 16 నుంచి 31వ తేదీల్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ కోటాను డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి అందుకు అనుగుణంగా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
డిసెంబర్ 16 సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆ రోజు సాయంత్రం ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతీ రోజు ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిత్య కల్యాణోత్సవం జరుగుతుంది. ధనుర్మాస శుక్రవారాల్లో తెల్లవారుజామున ధనుర్మాస కైంకర్యం, మూలవర్లకు అభిషేకం, ఉదయం 9.15 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 తెల్లవారుజాము నుంచే భక్తులకు వైకుంఠ ద్వారా సర్వదర్శనం కల్పిస్తారు.