బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏపీ నేతలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నేతలు నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారధి సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంతో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరులోని ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2019లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చింతల పార్థసారథి 2019లో అనకాపల్లి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జనసేన అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.