చంద్రబాబు, పవన్ భేటీలో మర్మమేంటి..!

చంద్రబాబు, పవన్ భేటీలో మర్మమేంటి..!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చల సమయంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఈ సమావేశంతో ఇద్దరి మధ్య పొత్తులపై కీలక ప్రకటనకు అవకాశాలున్నాయి. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో కొద్ది నెలల క్రితం పవన్ ను పోలీసులు అడ్డుకోవటంతో, విజయవాడలోని ఓ హోటల్ లో బస చేసిన పవన్ వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది.

చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్
జనసేన అధినేత టీడీపీ చీప్ చంద్రబాబు ఇంటికి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చి జీవో నెంబర్ 1 తో కుప్పంలో చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పోలీసులపైన ఫైర్ అయ్యారు. తనను అడ్డుకోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అడ్డుకోవటం పైన పవన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ తీరును తప్పు బట్టారు. గతంలో విశాఖ పరిణామాల తరువాత తనకు చంద్రబాబు స్వయంగా వచ్చి సంఘీభావం ప్రకటించటంతో, ఇప్పుడు పవన్ కూడా కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబుకు అండగా నిలవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు అస్పష్టంగా ఉన్న పొత్తుల పైన ఇద్దరు నేతలు చర్చించనున్నారు. ఏపీలో రాజకీయ పరిణామల పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

పొత్తులపై ఇక అధికారికంగా..
ఎన్నికలకు ఏపీలో అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి. టీడీపీ సిట్టింగ్ లకు ఇప్పటికే సీట్లు ఖరారు చేసింది. చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. లోకేష్ ఈ నెల 27నుంచి యువగళం యాత్ర ప్రారంభించనున్నారు. అటు పవన్ కల్యాణ్ తన వారాహితో రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో రెండు పార్టీల్లోనూ పొత్తుపైన క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. టీడీపీ పొత్తుల విషయంలో క్లియర్ గా ఉంది. 2014 తరహాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. కానీ, విశాఖలో పవన్ కల్యాణ్ ప్రధాని మోదీతో భేటీ తరువాత జనసేనాని వైఖరిలో కొంత మార్పు కనిపించింది. దీంతో, పొత్తుల పై నిర్ణయం ఆలస్యం అయింది. కానీ, బీజేపీతో జనసేన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బీజేపీ తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని స్పష్టం చేస్తోంది. టీడీపీ బీజేపీతో పొత్తు వ్యవహారంపైన వేచి చూసే ధోరణితో ఉంది. ఇప్పుడు చంద్రబాబు – పవన్ భేటీలో బీజేపీ వైఖరి పైన చర్చించే ఛాన్స్ ఉంది.

సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు..
చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఇద్దరి లక్ష్యం ఒక్కటే. జగన్ ను గద్దె దింపటం పైనే ఇద్దరు నేతలు ముందుకు కదులుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ పదే పదే చెబుతున్నారు. కానీ, దీనికి సంబంధించి వ్యూహం తనకు వదిలేయమని సూచించారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నెంబర్ 1 పైన భవిష్యత్ పోరాటాన్ని ఖరారు చేయనున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో పవన్ భేటీ ద్వారా వ్యూహాల పైన చర్చించి..ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ చాలా రోజులుగా ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని, ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తాయని చెబుతోంది. దీంతో, ఇక పొత్తు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. కానీ, బీజేపీ వైఖరి పైన స్పష్టత కోసం ఎదురు చూస్తారా.. లేక పొత్తు ప్రకటించి బీజేపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.