గ్రూప్-1 ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

గ్రూప్-1 ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. రెండు, మూడ్రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కమిషన్ ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. 503 గ్రూప్-1 ఉద్యోగాలకు అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల 29న ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. ఆపై అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించి, నిపుణుల కమిటీతో చర్చించింది. చివరికి 5 ప్రశ్నలను తొలగించి, నవంబర్ 15న తుది ‘కీ’ ని వెబ్ సైట్ లో పొందుపరిచింది.

ఆ తర్వాత రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇంతలోనే ఇద్దరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టులో ఫైనల్ హియరింగ్ ఉన్నది. సోమ లేదా మంగళవారం కోర్టు కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ వెంటనే మంగళవారం లేదా బుధవారం ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్నీ సిద్ధం చేసింది.