సీజే హామీతో న్యాయవాదుల సమ్మె విరమణ

సీజే హామీతో న్యాయవాదుల సమ్మె విరమణ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మంగళవారం సాయంత్రం తెలంగాణ బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, వరంగల్, నిజామాబాద్ బార్ అసోసియేషన్‌ల ప్రతినిధులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్‌ను ఆయన ఛాంబర్‌లో కలిశారు. వరంగల్, నిజామాబాద్ లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో న్యాయవాదులపై దాడికి సంబంధించి సీజేకి వివరించారు. న్యాయవాదులపై దాడికి గురైన వరంగల్, నిజామాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలపై హైకోర్టు సుమోటోగా తీసుకుంటుందని ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

ప్రధాన న్యాయమూర్తిని కలిసిన అనంతరం న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కొనసాగిస్తున్న కోర్టుల బహిష్కరణను విరమిస్తున్నట్టు ప్రకటించారు. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను కలిసిన వారిలో అడ్వకేట్ ప్రతినిధులు విరోజ్ రఘునాథ్, విష్ణువర్ధన్ రెడ్డి, సునీల్ గౌడ్, పాశం కృష్ణా రెడ్డి, నిజామాబాద్ బార్ అససియేషన్ అధ్యక్షుడు ఎఱ్ఱం గణపతి, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రతనిధులు కె. రాజు, దూడ ప్రశాంత్, న్యాయవాదులు సిరశాని గౌతం, బొమ్మరాజు నర్సింగ్ తదితరులు ఉన్నారు.