కొత్త మాణిక్యంతో కథ మారేనా..?

కొత్త మాణిక్యంతో కథ మారేనా..?

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్ రావు ఠాక్రేను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. సీనియర్లంతా మాణిక్కం ఠాగూర్ పై రెబల్ జెండా ఎగరవేయడంతో అధిష్టానం ఆయనను తప్పించింది. చివరకు మరాఠా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న మాణిక్ రావు ఠాక్రేకు తెలంగాణ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. నిజానికి మాణిక్కం ఠాగూర్ తో పోల్చుకుంటే మాణిక్ రావు ఠాక్రే బెస్ట్ ఆప్షన్ అన్న మాట తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి వినిపిస్తోంది.

ఎందుకంటే ఠాక్రేకు పార్టీ వ్యవహారాలపై గట్టి పట్టుంది. అందరినీ సర్దుకుపోగల తత్వం ఆయనది. ఎవరినీ కాదనకుండా, అందరినీ లైన్ లో పెట్టగల సమర్థత ఉంది. మాణిక్ రావు మహారాష్ట్ర నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎమ్మెల్సీగా, మంత్రిగా, పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఇక్కడి కంటే మరాఠా పాలిటిక్స్ గట్టిగా ఉంటాయి. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ను చక్కబెట్టడం ఆయనకు పెద్ద పని కాదన్న మాట బలంగా వినిపిస్తోంది.

సీనియర్లు కస్సుబుస్సుమంటున్నప్పటికీ ఈనెల 26 నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్ర మొదలు కానుంది. అందుకు ఆయన టీమ్ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. పాదయాత్రకు ముందే తనకు సన్నిహితుడైన మాణిక్కం ఠాగూర్ పై వేటు వేయడం పట్ల రేవంత్ కొంత అసంతృప్తితో ఉన్నట్లు టాక్. కానీ జరిగిందేదో జరిపోయింది ఇక కొత్త ఇంఛార్జ్ ను తన దారిలోకి తీసుకువచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే మాణిక్కం ఠాగూర్ లా మాణిక్ రావు ఠాక్రే ఉండరు. ఈయన రాజకీయ ఉద్దండుడు. మరి ఠాక్రేతో రేవంత్ రిలేషన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఈనెల 11న మాణిక్ రావు ఠాక్రే రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఇక్కడ పర్యటిస్తారు. నాయకులందరితోనూ ఆయన సమావేశం కానున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు సీనియర్లతోనూ ఆయన సమావేశం ఉంటుందని టాక్. ఈ నేపథ్యంలో మాణిక్ రావు ఠాక్రే ఇప్పటికే రాష్ట్ర నాయకులందరి బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీశారట. తెలంగాణ పర్యటనకు రాకముందే నాయకులందరి బయోడేటాల గురించి సంపూర్ణ సమాచారం సేకరించినట్లు టాక్. ఇవన్నీ చూస్తుంటే మాణిక్ రావు ఠాక్రే తనదైన ముద్ర వేయడానికి గట్టిగానే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి.

మాణిక్ రావు ఠాక్రే గురించి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. తమకు తెలిసిన మహారాష్ట్ర నాయకులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నట్లు టాక్. ఆయన వ్యవహారశైలి, పనితీరు ఎలా ఉంటుందని వాకబు చేస్తున్నట్లు సమాచారం. అయితే సదరు మహారాష్ట్ర నాయకులు ఠాక్రేతో జాగ్రత్తగా ఉండాలని సూచించారట. ఆయనతో రాజకీయం మామూలుగా ఉండదని, జాగ్రత్తగా ఉండకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఆయన వెనుకాడరని చెబుతున్నారట.

దీంతో ఈ కొత్త మాణిక్యం పాత మాణిక్యంలా ఉండడు, కచ్చితంగా బెండు తీస్తాడని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి నాయకుడైతేనే తెలంగాణ కాంగ్రెస్ లోని అన్ని వర్గాలను కలుపుకుపోతారని చెప్పుకుంటున్నారు. అందుకే మాణిక్ రావు ఠాక్రేపై కాంగ్రెస్ క్యాడర్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయన ఎంట్రీతో తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని కొండంత ధీమాతో ఉంది. మరి ఠాక్రేతోనైనా తెలంగాణ కాంగ్రెస్ లో కాక చల్లారుతుందా? ఎన్నికలకు ముందే అంతా కలిసిపోతారా? తెలంగాణ కాంగ్రెస్ బండి పట్టాలెక్కుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.