స్టేషన్ ఘన్ పూర్ లో పొలిటికల్ హీట్ !! 

స్టేషన్ ఘన్ పూర్ లో పొలిటికల్ హీట్ !!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న స్టేషన్ ఘన్ పూర్ లో మళ్లీ అలజడి రేగింది. ఓవైపు కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేయగా నేనేం తక్కువ అంటూ ఎమ్మెల్యే రాజయ్య కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పట్ల విధేయతను చాటుకుంటూనే, తాను చెప్పదలుచుకుంది సూటిగా చెప్పేశారు రాజయ్య. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ తనదేనని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు.

*తగ్గేదేలే అంటున్న రాజయ్య..
తెలంగాణ మొత్తంలో సీఎం కేసీఆర్ కు వీర విధేయుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. అంతేకాదు తన గెలుపును ఎవరూ అడ్డులేరని కూడా రాజయ్య తేల్చిచెప్పారు. సామాజికవర్గ పరంగా చూసినా తనకు ఎలాంటి ఢోకా లేదని రాజయ్య స్పష్టం చేశారు. నిజానికి కడియంలా ఆత్మగౌరవం లాంటి మాటలు రాజయ్య మాట్లాడకపోయినా సీఎం కేసీఆర్ పట్ల భక్తిని చాటుకుంటూనే, రాజకీయ వేడిని పుట్టించారు రాజయ్య.

*కడియం ప్రస్తావనే లేకుండా మాట్లాడిన రాజయ్య..
రాజయ్య వ్యాఖ్యల్లో ఎక్కడా కడియం శ్రీహరి గురించి ప్రస్తావించలేదు. అయినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తప్పకుండా కడియంను ఉద్దేశించి మాట్లాడినవేనన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. కడియం ఆత్మగౌరవ ఎజెండాతో మాట్లాడితే… సీఎం కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి రాజయ్య కౌంటరిచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన కులాన్ని కూడా ప్రస్తావించి తమ సామాజికవర్గమే ఎక్కువ బలంగా ఉందని వివరించే ప్రయత్నం కూడా చేశారు రాజయ్య.

*సై అంటే సై ..
ఎన్నికలు సమీపిస్తుండడంతో కడియం శ్రీహరి, రాజయ్య ఇద్దరూ స్టేషన్ ఘన్ పూర్ లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. రాజయ్య ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు ఇక్కడ్నుంచి గెలిచారు. మధ్యలో ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టును సాధించినా, ఎక్కుల కాలం నిలబెట్టుకోలేకపోయారు. అటు కడియం శ్రీహరి 2014లో వరంగల్ ఎంపీగా విజయం సాధించి.. ఆ తర్వాత కేసీఆర్ కేబినెట్ లో ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ 2018లో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. కడియం శ్రీహరి మంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానంతో ఆయనకు గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. అయినప్పటికీ కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ అయితే వచ్చింది. దీంతో గ్యాప్ అంతా ఒట్టిదేనని తేలిపోయింది. ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చిన బూస్ట్ తో కడియం జోరు పెంచారు. ముఖ్యంగా ఎంపీ పసునూరి దయాకర్ తో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. దీంతో సామాజికవర్గ కోణంలో కడియం శ్రీహరి కూడా వేగం పెంచారన్న ఊహాగానాలు వస్తున్నాయి.*కన్ఫ్యూజన్ లో కార్యకర్తలు
వరంగల్ నుంచి బలమైన ఎస్సీ నేతల్లో రాజయ్య కంటే కడియం శ్రీహరి పేరే ముందు వినిపిస్తుంది. ఆయన సీనియర్ కూడా. కానీ రాజయ్య కూడా తానేం తక్కువ కాదని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. కాబట్టి అటు కడియం వెంట నడవాలా? లేక సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు మద్దతు ఇవ్వాలా? తెలియక తికమకపడుతున్నారు. ఇద్దరూ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుండడంతో క్యాడర్ పరిస్థితి మాత్రం అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అయితే కడియం శ్రీహరి టికెట్ చేజిక్కించుకుంటారా? లేక రాజయ్య టికెట్ సాధించి మళ్లీ సత్తా చాటుతారా? అన్న దానిపై స్టేషన్ ఘన్ పూర్ లో ఇప్పట్నుంచే జోరుగా చర్చోపచర్చలు జరుగుతుండడం విశేషం!!