గులాబీ మయమైన ఖమ్మం
వరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా : ఖమ్మంలో జనవరి 18న జరిగే టీఆర్ఎస్ తొలి సభకు భారీ ఏర్పాట్లు చేశారు. 100 ఎకరాల్లో సభా స్థలం నిర్మాణం ఉండగా, 480 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఈ బహిరంగ సభకు తరలివచ్చే సుమారు 5 లక్షల మంది జనాల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఖమ్మం సభకు సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం వినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ , సీపీఎం జాతీయ నాయకులు తరలివస్తున్నారు.
సభకు తరలివచ్చే జనాల కోసం పది లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వెయ్యి మంది వాలంటీర్లతో సదుపాయాల కల్పన చేశారు. మహిళల కోసం 20,000 సామర్థ్యంతో రెండు స్పెషల్ ఎన్ క్లోజర్లు, 50 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. సభను వీక్షించేందుకు వీలుగా 50 భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి 500 మీటర్ల లోపు భారీ పార్కింగ్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు, అందుకోసం 20 పార్కింగు స్థలాలను సిద్ధం చేశారు. ప్రతీ వాహనానికి క్యూర్ కోడ్ కేటాయింపు చేసేలా ఏర్పాటు చేశారు.వివిధ జిల్లాల నుంచి వచ్చే వీవీఐపీలకు స్పెషల్ పాసులు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనంతో పాటు సభలో కూర్చునేలా పార్టీ ఆదేశాల మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మంత్రి హరీష్ రావు వారం రోజులుగా ఖమ్మంలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు జనాన్ని తరలించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి బస్సులను సమకూర్చింది. ఇక ఫ్లెక్సీలు, స్వాగతతోరణాలు, హోర్డింగులతో ఖమ్మం నగరం గులాబీమయమైంది. 6 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ పథకాలను దేశామంతా అమలు చేస్తామంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిసాయి.
ఇక ఈ బహిరంగ సభకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరానున్నారు. ఈ బహిరంగ సభతో దేశం దృష్టి ఖమ్మం సభ వైపే ఉందని బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ఈ సభపై జాతీయ, రాష్ట్ర మీడియా అటెన్షన్ గా ఉంది. జాతీయ పార్టీగా గులాబీ పార్టీ ఎంట్రీ ఇచ్చి, బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా ఖమ్మం జిల్లాలో జరుగడం శుభపరిణామమని అంటున్నారు. ఖమ్మం సభతో ఘనంగా జాతీయ ప్రస్థానం ప్రారంభిస్తున్న బీఆర్ఎస్ ఖమ్మం వేదికగా సత్తా చాటుతామంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , స్థానిక ప్రజా ప్రతినిధులు. సీఎం సభ ముగిసిన తరువాత భారీ క్రాకర్ షో నిర్వహించనున్నారు.