సొంతపార్టీ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి వ్యతిరేకత!!  

సొంతపార్టీ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి వ్యతిరేకత!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో పెద్దదిక్కుగా ఉన్నారు. ఓరుగల్లు పాలిటిక్స్ లో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంది. సీఎం కేసీఆర్ కూడా ఆయన అభిప్రాయానికి విలువ ఇస్తారని పార్టీలో చెప్పుకుంటారు. అలాంటి ఎర్రబెల్లి సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

*వారిని మారిస్తేనే బీఆర్ఎస్ విజయం ఖాయం..
20 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారిని మార్చేయాలట. అలా అయితే 100కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. ఓవైపు సీఎం కేసీఆర్ సిట్టింగులకే సీట్లు ఇస్తామని ప్రకటించగా, మరోవైపు మంత్రి ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

*ఆ ఎమ్మెల్యేలపై ఎర్రబెల్లి అసంతృప్తి
ఎర్రబెల్లి వ్యాఖ్యలపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఎర్రబెల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఆయన అంచనా వేస్తున్నారట. అందుకే అలాంటి వారిని మార్చేయాలని సీఎం కేసీఆర్ కు ఎర్రబెల్లి సూచన కూడా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను మార్చాలని ఎర్రబెల్లి ప్రతిపాదించినట్లు టాక్. ఆ నలుగురి పేర్లతో హైకమాండ్ కు లిస్టు ఇవ్వడమే కాకుండా, ప్రత్యామ్నాయంగా నలుగురు అభ్యర్థుల పేర్లను కూడా ఆయన సూచించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

*ఆ నలుగురిని మార్చితేనే మంచిది
ఇంతకూ ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఓరుగల్లు పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. అందులో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పేరు ఉండొచ్చని టాక్. ముఖ్యంగా కడియంతో ఉన్న ఫ్రెండ్ షిప్ దృష్ట్యా రాజయ్యను మార్చాలని ఎర్రబెల్లి చెబుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా మరో రిజర్వ్ సీటులోనూ అభ్యర్థిని మార్చాలని పార్టీ హైకమాండ్ పై ఎర్రబెల్లి ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఒక బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, మరో ఓసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కూడా మార్చకపోతే బీఆర్ఎస్ కు నష్టం వాటిల్లుతుందని ఎర్రబెల్లి చెబుతున్నారట. ఇలా మొత్తంగా నలుగురిని మార్చితే కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సత్తా చాటలేమని పార్టీ పెద్దలకు ఎర్రబెల్లి గట్టిగానే చెప్పినట్లు టాక్.

*హైకమాండ్ దృష్టికి వెళ్లిన ఎర్రబెల్లి టాక్..
ఉమ్మడి ఓరుగల్లులో పెర్ఫామెన్స్ బాగా లేని నలుగురు ఎమ్మెల్యేల లిస్టును ఎర్రబెల్లి ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్ కు ఇచ్చారట. ఎర్రబెల్లి సూచనల సంగతి సీఎం కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లిందని టాక్. అధిష్టానం కూడా ఈ ప్రతిపాదనపై సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు టాక్. నిజంగానే ఈ నలుగురు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ హైకమాండ్ మారుస్తుందా? లేక ఒకటి రెండు మార్పులు చేర్పులు జరిగే అవకాశముందా? అన్న దానిపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కచ్చితంగా ఎర్రబెల్లి చెప్పిన వారికే టికెట్లు కూడా ఇచ్చే అవకాశముందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇవన్నీ ఊహాగానాలేనా? లేక ఇందులో వాస్తవం ఉందా? అన్నది మంత్రి ఎర్రబెల్లికే తెలియాలి. ఈ ఊహాగానాలపై రాజకీయాలు విశ్లేషకులు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు.