అంధత్వ రహిత తెలంగాణే కేసీఆర్ లక్ష్యం: చల్లా
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్యాంపును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంటిపరీక్షలు చేసుకొని కళ్లద్దాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు.కంటిచూపు మందగించినా దవాఖానకు పోలేక అంధకారంలో మగ్గుతున్న పేదలను, వృద్ధులను కంటివెలుగుతో ఆదుకొనేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన అన్నారు. అవసరమైన వారందరికీ కంటి అద్దాలు అందిస్తూ, అవరసరమైతే శస్త్రచికిత్స చేస్తున్నారన్నారు. కంటిచూపు సరిగాలేని నిరుపేదలందరు కంటివెలుగు శిబిరాలకి వెళ్లి పరీక్షలు చేపించుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. తాను కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కళ్ళద్దాలను కంటి పరీక్షలు చేసుకొని తీసుకున్నానని తెలిపారు.
జనవరి 18 నుంచి జూన్ 30 వరకు జరిగే రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే సామూహిక కంటి వెలుగు కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.