2వ విడత కంటి వెలుగును ప్రారంభించిన కేసీఆర్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం కలెక్టరేట్ లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా దీనికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను నేతలు తిలకించారు.కంటి వెలుగు మొదటి దఫా కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో పాటు రెండో దఫా ఏర్పాట్లను అక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా కంటివెలుగు విశేషాలను, శిబిరంలో కంటి పరీక్షలు చేసే విధానాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా అతిథులకు వివరించారు. రిజిస్ట్రేషన్ మొదలు కంటి పరీక్షలు పూర్తై, అద్దాలు అందచేసే వరకు ఏయే దశల్లో ఏమేం చేస్తారో సమగ్రంగా తెలిపారు. ఈ వివరాలను ముగ్గురు సీఎంలు, ఇతర నేతలు ఆసక్తిగా విన్నారు. అంధత్వ రహిత తెలంగాణ కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ వారికి చెప్పారు. మొదటి దశ సక్సెస్ అయిందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మొదటి దశలో వచ్చిన ఫలితాలను వారికి వివరించారు.
తమ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామన్న ఢిల్లీ, పంజాబ్ సీఎంలు..
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సీఎస్ శాంతికుమారి సైతం కంటి వెలుగు విశేషాలను అతిథులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు సీఎం కేసీఆర్ ను ప్రత్యేక అభినందించారు. ప్రజలకు మేలు చేసే మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. అంతేకాకుండా కంటి వెలుగు వివరాలు తెలుసుకున్న అతిథులు తమ రాష్ట్రాల్లోనూ ఈకార్యక్రమాన్ని అమలు చేయాలని ఢిల్లీ, పంజాబ్ సీఎంలు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బహిరంగ సభలో ప్రకటించారు. ‘సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వేం కంటి వెలుగును ప్రారంభించేందుకు వచ్చాం. కానీ 4 కోట్ల మంది ప్రజల్లో అవసరమైన వారికి కంటి పరీక్షలు చేయడం, అవసరమైన వారికి అద్దాలు ఇవ్వడం, కంటి ఆపరేషన్లు చేయడం అద్భుతం. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు. మేం ఢిల్లీలోనూ, పంజాబ్ లోనూ కంటి వెలుగును అమలు చేస్తాం’ అని సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ అన్నారు.
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అధికారులు రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురికి కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి సీఎం కేసీఆర్ సహా నేతలు స్వయంగా కళ్లద్దాలు తొడిగారు. ధరావత్ పిచ్చమ్మకు కేరళ సీఎం పినరాయి విజయన్, మందా అన్నపూర్ణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అనుబోతు రామనాథంకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కోలెం జ్యోతికి సీఎం కేసీఆర్, అమరనేని వెంకటేశ్వర్లుకు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, గౌసియా బేగంకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కండ్లద్దాలు తొడిగారు.
ఈ సందర్భంగా కండ్లద్దాలు తొడిగిన తర్వాత కంటి చూపు ఎలా ఉన్నదని నేతలు వారిని అడగగా, ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నదని సమాధానం ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నేతలు ఫోటోలు దిగారు. కంటివెలుగు బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.