ఏసీబీ వలలో ఐటీడీఏ ఏఈఈ, డీఈఈ
వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ లో ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏటూరునాగారం ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ నవీన్ కుమార్, ఏఈఈ ఎండీ హబీద్ ఖాన్ లు కాంట్రాక్టర్ సంజీవ నుంచి రూ.50వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు.ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6గంటల సమయంలో ఐటీడీఏ కార్యాలయంలో చోటుచేసుకుంది. మేడారం ఆలయ కాంట్రాక్టు పనులు చేసిన వారికి చెల్లించాల్సిన రూ.16లక్షల చెక్కు విడుదల చేయడానికి ఏఈ, డీఈ లు రూ.50వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పట్టారు. సుమారు ఒక గంటపాటు ఐటీడీఏలోని ఇంజనీరింగ్ఈ విభాగంను ఏసీబీ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకుని సోదాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఐటీడీఏలో కలకలం రేగింది.