స్మితా ఇంట్లోకి చొరబడిన ఉద్యోగి అరెస్ట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన కేసులో ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ తో పాటు అతని స్నేహితుడు బాబును అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. అక్రమ చొరబాటు, న్యూసెన్స్ కింద వాళ్లపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులను జడ్జి ఎదుట హాజరు పరచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఆపై ఇద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో ఆనంద్ కుమార్ రెడ్డి (45) డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. కాగా తనకు కొన్ని సమస్యలున్నాయని, వాటిని స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని ఆనంద్ కుమార్ పోలీసులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లోని ప్లెజెంట్ వ్యాలీలోని ఐఏఎస్ క్వార్టర్స్ వద్దకు వెళ్లినట్లు చెప్తున్నాడు. ఐతే అపాయింట్మెంట్ లేకుండా అదీ రాత్రిపూట ఈ ఇద్దరు ఆమె ఇంట్లోకి వెళ్లడం, అది భద్రాతా సిబ్బంది కళ్లుగప్పడంతో కేసు నమోదైంది.