గాంధీ భవన్ కు దూరంగా కాంగ్రెస్ నేతలు !!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ ఫుల్ స్వింగులో ఉండేది. ఎప్పుడూ వచ్చి పోయే లీడర్లతో కిటకిటలాడేది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత అంటే 2014 తర్వాత కూడా కొంతకాలం గాంధీభవన్ లో హడావుడి కనిపించింది. ఉత్తమ్ హయాం వరకు పరిస్థితి కొంత బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు, క్యాడర్ హడావుడి తగ్గింది. రేవంత్ గ్యాంగ్ తప్ప ఇతర సీనియర్లు, క్యాడర్ గాంధీ భవన్ కు పెద్దగా రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
*గాంధీ భవన్ కు రాని లీడర్లు వీళ్లే..
ప్రస్తుతం గాంధీ భవన్ కు రెగ్యులర్ గా వచ్చే నాయకుల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు మాత్రమే వినిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీ భవన్ కు రానంటూ తెగేసి చెప్పేశారు. ఉత్తమ్ కూడా దూరంగానే ఉంటున్నారు. సీతక్క ఎప్పుడో గానీ రారు. జగ్గారెడ్డి అప్పుడప్పుడు తప్ప గాంధీ భవన్ కు అంతగా రావట్లేదని తెలుస్తోంది. ఇక శ్రీధర్ బాబు కూడా ఈమధ్య రావడం లేదని టాక్. జానారెడ్డి కూడా గాంధీ భవన్ వైపు చూడక చాలా రోజులే అయ్యిందని సమాచారం. రేవంత్ ను మినహాయిస్తే గాంధీ భవన్ కు వచ్చే వారి లిస్టు చూస్తే వీహెచ్, కోదండరెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వారే ఉన్నారు. ఇలా సిటీ కాంగ్రెస్ లీడర్లు తప్ప జిల్లాలకు చెందిన నాయకులు గాంధీ భవన్ కు రావడం లేదని టాక్.
అసలే బీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరికొన్నిరోజుల్లో రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో గాంధీ భవన్ లో కొంతైనా హడావుడి కనిపించాలి. కానీ ఆస్థాయిలో అక్కడ జోష్ మచ్చుకైనా కానరావడం లేదు. ఓవైపు నేతల రాక తగ్గిందంటే కాంగ్రెస్ సెకండ్ గ్రేడ్ నాయకులు, క్యాడర్ కూడా ఫోకస్ తగ్గించారట. గాంధీ భవన్ కు రావడానికి వారు అస్సలే ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలొస్తున్నాయి.
*సొంత పార్టీ క్యాడర్ లో నమ్మకాన్ని నిలబెట్టేనా
బీఆర్ఎస్, బీజేపీ హాట్ డైలాగులతో రాష్ట్రమంతా పొలిటికల్ హాట్ పుట్టిస్తుంటే కాంగ్రెస్ లో మాత్రం ఆ జోష్ లేదనే ప్రచారం జరుగుతోంది. గాంధీ భవన్ కే రాని నేతలు సొంత పార్టీ క్యాడర్ లో నమ్మకాన్ని ఎలా కలిగిస్తారన్న ప్రశ్నలు తలెత్తుత్తుతున్నాయి. రేవంత్ ఒక్కడు మాట్లాడితే సరిపోదని.. బీఆర్ఎస్, బీజేపీకి కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్లు పడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. లేని పక్షంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేసిన్నట్లు భావించాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా గాంధీ భవన్ లో హడావుడి పెరుగుతుందా? లేకపోతే ఎప్పటిలాగే ఇంటర్నల్ వార్ తో తెలంగాణ కాంగ్రెస్ సతమతమవుతుందా? అన్నది చూడాలి.