చైనాలో కొవిడ్ ఉద్ధృతి..13 వేల మరణాలు !
వరంగల్ టైమ్స్, బీజింగ్ : కరోనా ఉద్ధృతితో చైనా సతమతమవుతోంది. స్థానికంగా రోజూ వేల సంఖ్యలో కేసులు, మరణాలూ నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల వారం వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో దాదాపు 13 వేల వరకు కొవిడ్ సంబంధిత మరణాలు నమోదైనట్లు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC)వెల్లడించింది. కరోనా వైరస్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో శ్వాసవ్యవస్థ విఫలమై 681 మంది రోగులు మృతి చెందారని తెలిపింది. మరో 11,977 మంది కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధుల కారణంగా పరిస్థితి విషమించి మరణించినట్లు పేర్కొంది. అయితే, మహమ్మారితో ఇళ్ల వద్దే మృతి చెందిన వారి వివరాలు ప్రస్తావించలేదు.
జీరో కొవిడ్ ఎత్తేసిన నెల రోజుల్లోనే 60 వేల కొవిడ్ మరణాలు నమోదైనట్లు చైనా అంతకుముందు వెల్లడించిన విషయం తెలిసిందే. మరోవైపు నూతన సంవత్సర వేడుకల సెలవుల వేళ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది చైనీయుల రాకపోకలు స్థానిక అధికారులను కలవరపెడుతున్నాయి. సెలవుల సమయంలో రోజూ 30 వేలకుపైగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నివేదికలు అంచనా వేస్తున్నాయి. మున్ముందు మొత్తం మరణాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే, దేశంలో మెజారిటీ జనాభా ఇప్పటికే వైరస్ బారిన పడినట్లు చైనా సీడీసీలోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్యూ తెలిపారు. ఇప్పట్లో మరో వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు.