ట్విటర్, యూట్యూబ్‌లకు కేంద్రం సంచలన ఆదేశాలు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని ట్విటర్, యూట్యూబ్‌లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీలోని మొదటి భాగానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోల లింక్‌లను జత చేసి ఇచ్చిన సుమారు 50 ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ను కోరినట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచార అస్త్రమని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ డాక్యుమెంటరీని కేంద్ర హోం, విదేశాంగ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. భారత దేశ సుప్రీంకోర్టు అధికారం, విశ్వసనీయతలపై దాడి చేసేందుకు దీనిలో ప్రయత్నించారని వీరు నిర్థరించారు. భారత దేశ సార్వభౌమాధికారం, అఖండత, సమగ్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉందని గుర్తించారు. దీనివల్ల విదేశాలతో భారత దేశ స్నేహ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగా భారత దేశంలో ప్రజాశాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను ట్విటర్ యూట్యూబ్ లకు జారీ చేసింది.
ఈ ఆదేశాలను ఈ రెండు కంపెనీలు పాటించాయి. ఈ డాక్యుమెంటరీని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నిర్మించింది. దీనిలోని మొదటి భాగాన్ని బ్రిటన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) చానల్లో మంగళవారం ప్రసారం చేశారు, రెండో భాగాన్ని ఈ నెల 24న ప్రసారం చేస్తారు. ఇది ప్రోపగాండా పీస్ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో నిష్పాక్షికత లేదని, వలసవాద ఆలోచనా ధోరణి దీనిలో కనిపిస్తోందని మండిపడింది. ఈ డాక్యుమెంటరీని మన దేశంలోని బీబీసీ చానల్ ప్రసారం చేయడం లేదు. అయితే కొన్ని యూట్యూబ్ చానళ్లు భారత దేశ వ్యతిరేక ఎజెండాతో అప్లోడ్ చేశాయి. దీనిని మళ్లీ అప్లోడ్ చేస్తే వెంటనే బ్లాక్ చేయాలని యూట్యూబ్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
అదేవిధంగా ట్విటర్‌కు ఇచ్చిన ఆదేశాల్లో, ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, ఇతర ప్లాట్ఫారాలపైనగల దీని వీడియోల లింక్‌లను బ్లాక్ చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాల ప్రభావం కనిపించడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మైనారిటీలపై మోడీ వైఖరిని బయటపెట్టిన బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన తన ట్వీట్‌ను ట్విటర్ డిలీట్ చేసిందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు.