టీచింగ్ ఆస్పత్రుల్లో రేడియోగ్రాఫర్ల పోస్టింగ్స్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు గాను, టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో రేడియోగ్రఫర్స్ పోస్టుల భర్తీ కోసం 2017 లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం అర్హులతో కూడిన సెలక్షన్ లిస్ట్ విడుదల చేయగా, ఆయా పోస్టుల్లో తమకు వెయిటేజి కావాలని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోర్టు ఆశ్రయించారు.
దీంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆలస్యం కావడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం, ప్రక్రియ త్వరగా పూర్తి అయ్యేలా చొరవ చూపింది. ఈ క్రమంలో కేసును కొట్టి వేస్తూ హై కోర్టు తీర్పు ఇవ్వడంతో భర్తీకి మార్గం సుగమమైంది. టీఎస్పీఎస్సీ సెలక్షన్ లిస్ట్ విడుదల చేసిన వెంటనే సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి, వారికి పోస్టింగులు ఇస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.