నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా యువనేత?
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఏపీలో పార్టీ విస్తరణపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సీరియస్ గా దృష్టి సారించారు. ఏపీ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా తోట చంద్రశేఖర్ కు అవకాశం కల్పించారు. రావెల కిశోర్ బాబు లాంటి నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. అంతేకాదు చంద్రశేఖర్ టీమ్ ఇప్పుడు ఏపీలో పార్టీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా ప్రత్యేకదృష్టి సారించాలని తోట చంద్రశేఖర్ బృందం కేసీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కేసీఆర్ ముందు పెడితే, దానికి ఆయన కూడా ఓకే చెప్పినట్లు టాక్. అంతేకాదు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్న కవితను ఏపీ వ్యవహారాలు చూసుకోవాలని కేసీఆర్ చెప్పినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అందుకే చంద్రశేఖర్ బృందం ఇటీవల కవితను కలిసిందని ఊహాగానాలు వస్తున్నాయి.
ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ బృందం కలవడంతో ఇక ఆమె నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయకపోవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ లోక్ సభ స్థానం కన్నా, ఆమెను రాజ్యసభకు పంపేందుకు సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు టాక్. అందుకే ఏపీ వ్యవహారాలు చూసుకోవాలని కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఏపీలో పర్యటించేందు కవిత సిద్ధమవుతున్నారని సమాచారం.
*ఇదే సరైన ప్లానా..
ఏపీ రాజకీయాలపై కవిత దృష్టి పెడితే… మరి నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఓ యువనేతను అక్కడి నుంచి బరిలో దింపే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డిని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుత నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కు గట్టి పోటీ ఇవ్వాలంటే బలమైన అభ్యర్థి కావాలి. కాబట్టి అరవింద్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు పోచారం భాస్కర్ రెడ్డి సరైన అభ్యర్థి అని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారట. అరవింద్ ను అన్నిరకాలుగానూ ఢీకొట్టగల సమర్థత ఆయనకు ఉందని బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆలోచిస్తోందట. ముఖ్యంగా ఓ యువనేతను నిలబెట్టి, గెలిపించుకోవడం ద్వారా అరవింద్ కు షాకివ్వాలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. గత ఎంపీ ఎన్నికల్లో కవితకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన ప్లాన్ అని గులాబీదళం భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాతిపాదనకు స్పీకర్ పోచారం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా అంగీకరించినట్లు టాక్.
*అరవింద్ ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు..
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఇప్పట్నుంచే గట్టిగా పావులు కదుపుతోందని సమాచారం. అందులో భాగంగానే ఇటీవల సర్వేలు కూడా చేయించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆ సర్వేల ప్రకారమే బలమైన సామాజికవర్గం, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న పోచారం భాస్కర్ రెడ్డిని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి ఒకవేళ పోచారం భాస్కర్ రెడ్డి వెనుకడుగు వేసినా, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తోందని టాక్. మరి నిజంగానే కవిత నిజామాబాద్ ఎంపీ బరి నుంచి తప్పుకుంటారా? పోచారం భాస్కర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా? లేదా మంత్రి ప్రశాంత్ రెడ్డి రేసులోకి వస్తారా? అన్న దానిపై నిజామాబాద్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పట్నుంచే సీరియస్ గా చర్చ జరుగుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.!!