ఓరుగల్లు బీఆర్ఎస్ లో డిష్యుం డిష్యుం !!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. నేతలు ఒకరంటే ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అగ్రనేతల మధ్య ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కొత్త చర్చను లేవనెత్తుతున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా భూపాలపల్లిలో ఫైటింగ్ సీన్ నెలకొంది. భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమాణా రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మధ్య విభేదాలు బయటపడ్డాయి. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరు లేదంటూ ఆయన అనుచరులు లొల్లి లొల్లి చేశారు. దీంతో గండ్ర వర్గానికి కోపమొచ్చింది. రెండు వర్గాలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించాయి. ఇక మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ మధ్య దాదాపు కొట్టుకున్నంత పని జరిగింది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతుంటే, శంకర్ నాయక్ అభ్యంతరం చెప్పారు. దీనికి సీతారాం నాయక్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మాట్లాడుతుంటే అడ్డు తగలమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాట్ డైలాగులతో రెచ్చిపోయారు. ఆత్మగౌరవం అంటూ కొత్త రకం డైలాగులతో కలవరం పుట్టించారు. ఈ డైలాగులు కడియం తనను ఉద్దేశించి చేశారని ఎమ్మెల్యే రాజయ్య భావించినట్లున్నారు. ఆయన కూడా తానేం తక్కువ కాదని నిరూపించారు. టికెట్ నాదే, గెలుపునాదేనంటూ హీట్ పుట్టించారు. కడియం శ్రీహరికి స్ట్రాంగ్ కౌంటరిచ్చేలా ఆయన మాటలు ఉండడం ఇద్దరి మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది.
బీఆర్ఎస్ నేతల మధ్య హాట్ డైలాగులు ఇలా ఉంటే తానేం తక్కువ అనుకున్నారో ఏమో కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా రేసులోకి వచ్చారు. 20 మంది ఎమ్మెల్యేలను మార్చాలంటూ కొత్త రాగం అందుకున్నారు. ఈ వ్యాఖ్యలు కచ్చితంగా సొంత జిల్లా ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేందుకేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది ఎర్రబెల్లిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తమ టికెట్లకు ఎసరు పెట్టేందుకే ఎర్రబెల్లి ఈ కామెంట్స్ చేశారని కొందరు ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్లు టాక్. దీనికి తోడు మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మధ్య కూడా గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు, ఎమ్మెల్యేలు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నారు. ఎన్నికల ముంగిట లేని లొల్లిని కొని తెచ్చుకుంటూ క్యాడర్ లో గందరగోళాన్ని పెంచుతున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ లో కీలకమైన ఓరుగల్లుకు చెందిన నేతలు ఇలా హాట్ డైలాగులు పేల్చడంపై గులాబీ పెద్దలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు సమాచారం. అసలే బీజేపీ వేగం పెంచి దూసుకుపోతోంది. తానూ రేసులో ఉన్నానంటూ కాంగ్రెస్ కదం తొక్కుతోంది.
ఈ తరుణంలో ఇతర పార్టీల కంటే సొంత పార్టీలోని నేతలే బీఆర్ఎస్ కొంప ముంచే ప్రమాదముందని గులాబీ పెద్దలు భావిస్తున్నారట. సాధ్యమైనంత త్వరగా ఈ అంతర్గత విభేదాలకు స్వస్తి పలకకపోతే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ హైకమాండ్ నేతల మధ్య జగడాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా? లేదా లైట్ తీసుకుంటుందా? అన్నది చూడాలి!