తెలంగాణలో జనసేన పోటీ?
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ తరపున ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు కేసీఆర్ సిద్ధమవ్వడంపై పవన్ అసంతృప్తితో ఉన్నట్లు టాక్. అన్నింటికి మించి తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై పవన్ కల్యాణ్ గుస్సాగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
* పవన్ కోపం వెనుక కారణాలివేనా !
కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ఆర్థికంగా బలంగా ఉన్నారు. అంతేకాకుండా పవన్ కు సన్నిహితుడనే పేరుంది. అలాంటి నాయకుడిని కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో జనసేనానికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీలో అడుగుపెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టు టాక్. అందుకే ఏపీలో బీఆర్ఎస్ రాకపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆ కోపంతోనే తెలంగాణ పాలిటిక్స్ లోకి తాను వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
దీంతో ఇన్నాళ్లుగా తెలంగాణలో పోటీపై వెనుకడుగు వేసిన పవన్ ఇక సీఎం కేసీఆర్ ఇలాకాలోనూ పోటీ చేయాల్సిందేనని గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఏపీతో పాటు తెలంగాణలో వేగం పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుగసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు చెందిన జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ మాట్లాడినట్లు టాక్. వారంతా వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాల్సిందేనని జనసేనానికి వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పోటీ చేయడంపై పవన్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు ఊహాగానాలు వస్తున్నాయి.
* కొండగట్టులో వారాహి పూజల వెనుక ఆంతర్యమేమిటి !
తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కొండగట్టులో పూజలు చేయించడం వెనక కూడా కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని టాక్. తెలంగాణలోని అభిమానులను ఆకట్టుకునేందుకే కొండగట్టును ఆయన ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణలో పోటీచేస్తే సీఎం కేసీఆర్ పై పవన్ విమర్శలు చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలోలా జగన్ సర్కారుపై చేసినంత గట్టిగా ఇక్కడ విమర్శలు చేయకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ తో పవన్ కల్యాణ్ కు మంచి సాన్నిహిత్యమే ఉంది.
*కేసీఆర్ అంటే అభిమానమే..కానీ
పవన్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎక్కువ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లు పెంచడానికి సీఎం కేసీఆర్ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కాబట్టి కేసీఆర్ పై పవన్ కు మంచి అభిప్రాయమే ఉందని తెలుస్తోంది. కానీ ఏపీ పాలిటిక్స్ లోకి సీఎం కేసీఆర్ రావడం జనసేనానికి నచ్చడం లేదట. ఆ ఒక్క కారణంతోనే తెలంగాణలో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే పవన్ తెలంగాణలో పోటీ చేస్తారా? తెలంగాణలోని జనసేన అభిమానులు కోరుకున్నట్లు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతారా? లేక గత ఎన్నికల్లోలాగా దూరంగా ఉంటారా? అన్నది చూడాలి.