నటి జమున మృతికి సీఎం కేసీఆర్ సంతాపం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీనియర్ నటి జమున మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వందల చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందారని అన్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాభిమానాన్ని పొందారన్నారు.
సినీనటిగా కళాసేవకే పరిమితం కాకుండా ఎంపీగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన జమున ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. మరో ప్రక్క జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.