‘యువగళం’ లో తారకరత్నకు అస్వస్థత
వరంగల్ టైమ్స్, అమరావతి : నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. శుక్రవారం కుప్పం నియోజకవర్గం కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో కళ్లు తిరిగి పడిపోవడంతో తారకరత్నను చికిత్స కోసం హుటాహుటిన కుప్పం ఆస్పత్రికి తరలించారు. కుప్పంలో ఉన్న ఎమ్మెల్యే బాలకృ ష్ణ విషయం తెలుసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.నారా లోకేష్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరద రాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘంగా ‘యువగళం’ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన యాత్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.