అవసరమైతే మళ్లీ గవర్నర్‌ను కలుస్తాం..

అవసరమైతే మళ్లీ గవర్నర్‌ను కలుస్తాం..

వరంగల్ టైమ్స్, విజయవాడ: మార్చిలో జరిగే ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు.ఉద్యోగుల బకాయిలు, చెల్లింపులు, చట్టబద్ధత అనే అంశంపై విజయవాడలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 13 తీర్మానాలను ఆమోదించారు.

 

జీతాల చెల్లింపు విషయంలో చట్టం చేయాలనే డిమాండ్‌పై అన్ని పార్టీలకు వినతిపత్రాలు ఇస్తామని సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చట్టం చేయమని అడిగితే ఇతర సంఘాల నేతలు ఎందుకు వింతగా చూస్తున్నారో అర్థం కాడడం లేదన్నారు. మహారాష్ట్రలో ఉద్యోగుల బదిలీలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చట్టం ఉందని గుర్తు చేశారు.ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలతో పాటు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను కలిసి వినతిపత్రాలు ఇస్తామన్నారు. జీతాల చెల్లింపుల చట్టబద్ధతపై అవసరమైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తామని పేర్కొన్నారు.