గ్రూప్-4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ గురువారం ప్రకటించింది. జులై 1న రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పరీక్ష ఉంటుంది.
గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లోని 8 వేలకు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిలో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలున్నాయి. వీటి కోసం గత డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ అయింది. ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 3 తో గ్రూప్-4 దరఖాస్తు గడువు ముగియనుంది.