నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ2

నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ-డీ2

వరంగల్ టైమ్స్, తిరుపతి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని శుక్రవారం ఉదయం 9. 18 గంటలకు ప్రయోగించనుంది. ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( షార్ ) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రారంభమైంది. ఇది 6.30 గంటల పాటు కొనసాగనుంది. అనంతరం షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ2 నింగిలోకి బయల్దేరనుంది. ఈ ప్రయోగం 15 నిమిషాల్లో పూర్తికానుంది.ఈ చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2 లో 156.3 కిలోల బరువున్న ఈఓఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 450 కిలోమీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07, 880 సెకన్లకు జానుస్-1, 900 సెకన్లకు ఆజాదీశాట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.