ఫలించని వైద్యం..తిరిగిరాని లోకాలకు తారకరత్న

ఫలించని వైద్యం..తిరిగిరాని లోకాలకు తారకరత్న

వరంగల్ టైమ్స్, బెంగుళూర్ : నందమూరి తారకరత్న ఇకలేరు. నేడు బెంగుళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 22 రోజులుగా ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. నందమూరి, నారా ఫ్యామిలీలు తమ కుటుంబ సభ్యుడి ప్రాణం కాపాడటం కోసం చేయని ప్రయత్నం లేదు. ఐతే విధి మాత్రం తారకరత్నను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.

మాజీ సీఎం, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ( సీనియర్ ఎన్టీఆర్ )కు తారకరత్న స్వయానా మనవడు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమారుడు తారకరత్న. ఆయన వయసు 39 యేళ్లు మాత్రమే. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్లిపోవడం నందమూరి అభిమానులను, టీడీపీ శ్రేణులను తీవ్రంగా కలిచివేస్తోంది.

నందమూరి తారకరత్నకు భార్య అలేఖ్యారెడ్డి, కూతురు నిష్క ఉన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డి. ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. నందీశ్వరుడు సినిమాకు అలేఖ్యారెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతోనే బాలకృష్ణతో పాటు నందమూరి ఫ్యామిలీ, నారా కుటుంబసభ్యులు బెంగుళూరుకు బయల్దేరినట్లు సమాచారం. అయితే తారకరత్న మృతితో రెండు ఫ్యామిలీలు శోకసంద్రంతో మునిగిపోయాయి.