బాడీ గ్రోతింగ్ రూమర్స్ పై నటి హన్సిక ఫైర్

బాడీ గ్రోతింగ్ రూమర్స్ పై నటి హన్సిక ఫైర్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, పదహారేళ్ళకే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందింది హన్సిక మొత్వాని. ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.

అయితే హీరోయిన్‌ శరీరంలో కొద్దిగా మార్పులు కనిపించినా దానిపై విపరీతమైన పుకార్లు వస్తుంటాయి. అందం పెంచుకునేందుకు సర్జరీలు, ఇంజక్షన్స్‌ తీసుకున్నారంటూ ట్రోల్స్‌ చేస్తుంటారు. సమంత, శ్రుతిహాసన్‌ తదితర స్టార్‌ నాయికలు విదేశాల్లో సర్జరీలు చేయించుకున్నారంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హన్సికపై కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఈ రూమర్స్‌పై నటి తాజాగా స్పందించింది. ‘లవ్‌ షాదీ డ్రామా’ రెండో ఎపిసోడ్‌లో ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

‘సెలబ్రిటీగా ఉండటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏండ్ల వయసు ఉన్నప్పుడు చాలా మంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతోందనుకుంటా. చాలా మంది నేను త్వరగా పెరిగేందుకు హార్మోనల్‌ ఇంజక్షన్స్‌ తీసుకున్నా అంటూ రాసుకొచ్చారు. ఎనిమిదేళ్ల వయసులోనే నేను నటిని అయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్‌ ఇంజక్షన్స్‌ ఇచ్చి నన్ను త్వరగా పెద్దదాన్ని చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు..?’ అంటూ హన్సిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ రూమర్స్ పై హన్సిక తల్లి మోనా ఫైర్ అయ్యారు. ‘నేను నిజంగా హన్సికకి ఇంజక్షన్స్ ఇచ్చి పెంచి ఉంటే టాటా, బిర్లా కంటే ధనవంతురాలిని అయ్యే దానిని. ప్రతీ ఒక్కరు త్వరగా పెరిగేందుకు నా దగ్గరికే వచ్చేవారు కదా, ఇలా అసత్యమైన ప్రచారాలు చేసేందుకు కనీసం కామన్ సెన్స్ ఉండాలి’ అంటూ హన్సిక తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హన్సిక మోత్వానీ వివాహం వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో గతేడాది డిసెంబర్‌ 4న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ జైపూర్‌లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.