కామారెడ్డి కాంగ్రెస్ లో మదనమోహనం!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : కామారెడ్డి కాంగ్రెస్ లో వింత రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి గడ్డ తన అడ్డా అని షబ్బీర్ అలీ ఢంకా భజాయించి చెబుతుంటే, అదేం లేదు ఎవరికి టికెట్ వస్తే వాళ్లదే అడ్డా అని మదన్ మోహన్ రావు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షబ్బీర్ అలీ దూకుడు పెంచితే, తానేం తక్కువ కాదని మదన్ మోహన్ రావు చెబుతున్నారు.
*ఆ ఎఫెక్ట్ తోనే మదన్ రూట్ మార్చారా!
నిజానికి మదన్ మోహన్ రావు కాంగ్రెస్ లో లేటుగా ఎంట్రీ ఇచ్చారు. మదన్ మోహన్ రావు రాజకీయ నేపథ్యం టీడీపీ నుంచి మొదలైంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు స్వయానా అల్లుడాయన. అలాంటి మదన్ మోహన్ రావు సొంత గుర్తింపు కోసం కాంగ్రెస్ లో చేరారు. 2019 ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన బీబీ పాటిల్ కు చివరి వరకు ముచ్చెమటలు పట్టించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు సహకరించకపోవడం వల్లే మదన్ ఓడిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది.
ముఖ్యంగా ఆ ఎన్నికల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మదన్ మోహన్ రావుకు ఆశించిన స్థాయిలో నేతలు సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే మదన్ మోహన్ రావు ఓడిపోయారని, లేకపోతే ఎంపీ కావడం ఖాయంగా జరిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ సారి మదన్ మోహన్ రావు రూట్ మార్చారు.
*మదన్ ను షబ్బీర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు..
గత ఎన్నికల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి తనకు సరైన సపోర్ట్ లభించకపోవడంతో మదన్ మోహన్ రావు ఆ రెండు నియోజకవర్గలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారు. జాబ్ మేళాలతో నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ పార్టీ అగ్రనేత, కామారెడ్డి టికెట్ పై కర్చీఫ్ వేసిన షబ్బీర్ అలీకి నచ్చడం లేదని టాక్. తన అడ్డాలో మదన్ మోహన్ రావు ఇలాంటి కార్యక్రమాలు చేయడమేంటని ఆయన గుర్రుగా ఉన్నారట. అంతేకాదు తన సీటుకు ఎసరు పెట్టే పనిలో మదన్ ఉన్నారని షబ్బీర్ అలీ అనుకుంటున్నారట. అందుకే మదన్ ను షబ్బీర్ అలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
*ఏదైతే అదీ..ఫుల్ కాన్ఫిడెన్స్ ..
ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జాజాల సురేందర్ కారెక్కేశారు. దీంతో ఆ నియోజకవర్గంపైనా మదన్ ద్రుష్టి సారించారు. కుదిరితే కామారెడ్డి, లేకపోతే ఎల్లారెడ్డిలో పోటీ చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారని సమాచారం. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి కాదని తాను టికెట్ సాధిస్తానని మదన్ ధీమాగా ఉన్నారట. ఆస్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ తో మదన్ కు సన్నిహిత సంబంధాలున్నాయని కూడా టాక్. అందుకే టికెట్ పై మదన్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఒకవేళ కామారెడ్డి టికెట్ రాకపోయినా ఎల్లారెడ్డి నుంచి అయినా బరిలోకి దిగేందుకు మదన్ మోహన్ రావు సిద్ధంగా ఉన్నారట. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మదన్ ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
*టికెట్ పై పక్కా ధీమాగా మదన్
ముఖ్యంగా మదన్ మోహన్ రావుకు కాంగ్రెస్ పెద్దలతో మంచి పరిచయాలున్నాయి. ఆ పరిచయాలతోనే 2019 ఎన్నికల్లో టికెట్ సాధించుకుని, షబ్బీర్ అలీ లాంటి వారిని ఆయన ఆశ్చర్యపరిచారు. ఈ ఎన్నికల్లోనూ ఎవరు సహకరించినా, సహకరించకపోయినా తాను అనుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ను సాధిస్తానని మదన్ చాలా ధీమాగా ఉన్నారు. దీంతో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే మదన్ ఎక్కడ నుంచి పోటీచేసినా ప్రత్యర్థులకు మాత్రం ఈసారి ముచ్చెమటలు ఖాయం. అంత పక్కా ప్లానింగ్ తో మదన్ మోహన్ రావు స్కెచ్ వేసుకుంటున్నారని టాక్. మరి మదన్ కు కామారెడ్డి టికెట్ దక్కుతుందా? లేక ఎల్లారెడ్డి బరిలో ఉంటారా? లేకపోతే గత ఎన్నికల్లోలాగే జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అన్నది చూడాలి.