పసివాడిని పొట్టపెట్టుకున్న వీధికుక్కలు

పసివాడిని పొట్టపెట్టుకున్న వీధికుక్కలు

వరంగల్ టైమ్స్, నిజామాబాద్ జిల్లా : అభం శుభం తెలియని ఓ నాలుగేళ్ల బాలుడిని సెలవు రోజు కాస్త ఆటవిడుపు కోసం తండ్రి తాను పని చేస్తున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఓవైపు తన తండ్రి పనిలో నిమగ్నం కాగా ఒంటరిగా సమీపంలో ఉన్న అక్క దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. ఉన్నట్లుండి వీధి కుక్కలు వెంటపడటంతో బెదిరిపోయాడు. అయినా వాటి బారి నుంచి తప్పించుకునేందుకు తన శక్తి మేర ప్రయత్నించాడు. కానీ జంతువును వేటాడినట్లు ఆ కుక్కలన్నీ ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలో శరీరాన్ని వాటికి వదిలి తనువు చాలించాడు. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పీఎస్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన ముత్యం గంగాధర్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఛే నెంబర్ చౌరస్తాలోని ఓ కారు సర్వీస్ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య జనప్రియ, 8 ఏళ్ల కుమార్తె, కుమారుడు ప్రదీప్(4)లతో కలిసి బాగ్ అంబర్‌పేట్ ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరిని వెంటబెట్టుకుని తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని లోపలికి తీసుకెళ్లాడు. ప్రదీప్‌ అక్కడే ఆడుకుంటుండగా తండ్రి పనుల్లో నిమగ్నమయ్యాడు.

ఈ క్రమంలో బాలుడు అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా కుక్కలు వెంటబడ్డాయి. భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటూ ఇటూ పరిగెత్తాడు. ఎంతకీ వదలని శునకాలు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేయడంతో కింద పడిపోయాడు. ఒకానొక దశలో ఒక కుక్క కాలు, మరో శునకం చేయి నోట కరచుకుని చెరో వైపు లాగడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విన్న అక్క తండ్రికి విషయం చెప్పడంతో అతడు వచ్చి వాటిని గదమాయించి బాలుడిని ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ప్రదీప్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో గుండెలు పగిలేలా ఏడ్చాడు.