గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూత
వరంగల్ టైమ్స్, చిత్తూరు జిల్లా : సమైక్యాంధ్రలో మాజీ మంత్రిగా, మాజీ డిప్యూటీ స్పీకర్ గా చేసిన గుమ్మడి కుతూహలమ్మ కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన కుతూహలమ్మ అనారోగ్యంతో తిరుపతిలోని ఆమె నివాసంలోనే కన్నుమూశారు. గుమ్మడి కుతూహలమ్మ జూన్ 1, 1949లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలోని కందుకూరులో జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పని చేసి అనంతరం రాజకీయాల్లో చేరారు.
1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పని చేసిన ఆమె 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980 – 1985లో చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా, కో-ఆప్షన్ సభ్యురాలిగా పనిచేశారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆమె 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. 1992-1993మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.