ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ కైవసం 

ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్ ఆద్మీ కైవసం

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ మేయర్​ పీఠాన్ని ఆమ్​ ఆద్మీ పార్టీ దక్కించుకుంది. 15 యేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గత ఎన్నికల్లో ఓటమిపాలైంది. బుధవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఓబెరాయ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో షెల్లీ విజయం సాధించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురు ఆప్ నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. ఆప్ కౌన్సిలర్ షెల్లీ ఒబేరాయ్ ఢిల్లీ మేయర్ గా ఎన్నిక కావడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు.

ఢిల్లీ మేయర్ గా షెల్లీ ఒబేరాయ్ గెలవడం ఢిల్లీ ప్రజల విజయమని అన్నారు. ‘చివరకు ప్రజలే గెలిచారు. గుండాలు ఓడిపోయారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజలు గూండాయిజాన్ని ఓడించారు. ఢిల్లీ మేయర్ గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్ కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. మరోవైపు తాను రాజ్యాంగబద్ధంగా పని చేస్తానని ఢిల్లీ మేయర్ గా ఎన్నికైన షెల్లీ ఒబేరాయ్ పేర్కొన్నారు.

డిసెంబర్ లో జరిగిన ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో 250 డివిజన్లకు 134 చోట్ల ఆప్ అభ్యర్థులు గెలుపొందారు. గత అనుభవాల దృష్ట్యా మేయర్ ఎన్నిక సందర్భంగా ఢిల్లీ నగరపాలిక కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఓటింగ్ కు గంటన్నరసేపు కేటాయించినట్లు ప్రిసైడింగ్ అధికారి సత్యశర్మ తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు సభ్యులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.