పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన హరీశ్ రావు

పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన హరీశ్ రావు

వరంగల్ టైమ్స్, సిద్దిపేట జిల్లా : నంగునూరు మండలం మగ్దంపూర్ గ్రామంలో బీరప్ప-కుర్మ కమ్యూనిటీ హాల్ ను రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం లైబ్రరీ భవనం, ఓపెన్ జిమ్, ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్, ఎస్సీ మాల పోచమ్మ దేవాలయానికి భూమి పూజ, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవాలు చేశారు. అంతకు ముందు ఘనపూర్ గ్రామంలో శ్రీ దుర్గామాత విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి, కానీ మోసేవాడికే భారం తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మీరు పాలించే రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అంటూ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుకు 24 గంటల ఫ్రీ కరెంట్, సాగుకు నీళ్లు, ఆడపిల్ల పెండ్లికి లక్ష రూపాయలు, రూ. 2016 పెన్షన్, గింజ కూడా వదలకుండా పంట కొనుగోలు కేసీఆర్ తప్ప దేశంలో మరే రాష్ట్రంలో నైనా చేస్తున్నారా ? అంటూ ఆయన మండిపడ్డారు.

గతంలో 50 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి పనులు చేయలేదో చెప్పాలే అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉండి అభివృద్ధి చేయనోళ్లు ఇప్పుడు అభివృద్ధిని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీని, కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే, ఇంకా కష్టపడి పని చేస్తామని ప్రజలకు ఆయన తెలిపారు.