మంచిర్యాలలో ద్విముఖ పోరు !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : మంచిర్యాలలో రాజకీయం రసవత్తరంగా ఉంది. ఇక్కడ బీఆర్ఎస్-కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. దీనికి తోడు బీజేపీ కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014, 2018లో వరుసగా విజయాలు సాధించి సత్తా చాటారాయన. ఈ నేపథ్యంలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో దివాకర్ రావు ఉన్నారు.
గతంలో 1999,2004లోనూ లక్షెట్టిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు దివాకర్ రావు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యలో 2014కు ముందు టీఆర్ఎస్ లో జాయినయ్యారు. అప్పటిదాకా టీఆర్ఎస్ లో ఉన్న గడ్డం అరవింద్ రెడ్డి పార్టీ మారడంతో దివాకర్ రావు చివరి నిమిషంలో గులాబీగూటికి చేరారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లోనూ మరోసారి విజయఢంకా మోగించారు. మొత్తంగా ఇప్పటివరకు 4సార్లు ఎమ్మెల్యే విజయం సాధించారు దివాకర్ రావు. ఇప్పుడు మరోసారి గెలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
మంచిర్యాల జిల్లాగా మారడంతో మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు మంచి ఊపు ఉంది. ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దివాకర్ రావు కూడా ముందున్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనపై పెద్ద వ్యతిరేకత లేదన్న టాక్ ఉంది. కానీ వరుసగా రెండుసార్లు ఆయనే ఎమ్మెల్యేగా ఉండడంతో ఈసారి జనం మార్పు కోరుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
దివాకర్ రావు ఈసారి గెలవడానికి చెమటోడ్చక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా బలమైన గ్రూపు పనిచేస్తోందన్న వాదనలున్నాయి. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ప్రస్తుతం గులాబీపార్టీలోనే ఉన్నారు. దీంతో మంచిర్యాల టికెట్ కోసం ఆయన కూడా గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ దగ్గర తన పాత పరిచయాలను అరవింద్ రెడ్డి గట్టిగానే వాడుతున్నారట. కాబట్టి బీఆర్ఎస్ హైకమాండ్ దివాకర్ రావుకు హ్యాండిచ్చి, అరవింద్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. దీంతో దివాకర్ రావు ముందు టికెట్ సాధించడంపై ఫోకస్ చేస్తున్నారట.
అరవింద్ రెడ్డిని వెనక్కి నెట్టి టికెట్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఇక్కడ టికెట్ సాధించాలంటే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అభిప్రాయం కీలకంగా మారవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ సుమన్ చూసుకుంటున్నారు. ఆయన ఎవరికి చెబితే వారికి టికెట్ ఇచ్చేందుకు గులాబీ పెద్దలు సిద్ధంగా ఉన్నారట. కాబట్టి సుమన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక మంచిర్యాలలో కాంగ్రెస్ కు గట్టి ఓటు బ్యాంకు ఉంది. క్యాడర్ కూడా స్ట్రాంగ్ గా పనిచేస్తున్నారు. ఇక్కడ కావలసింది పార్టీని నడిపించే సరైన నాయకుడు. ప్రేం సాగర్ రావు ఉన్నప్పటికీ ఆయన కొంత వన్ సైడ్ గా వెళ్తున్నారన్న విమర్శ ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ప్రేం సాగర్ రావు ముందున్నారు. అయితే రేవంత్ రెడ్డి వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
మంచిర్యాలలో రేవంత్ వర్గం కూడా గట్టిగానే ఉంది. దీంతో ప్రేంసాగర్ రావుకు టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానాలున్నాయి. టికెట్ ఎవరికిచ్చినా మరొకరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ఇంటర్నల్ వార్ కాంగ్రెస్ కు పెద్ద మైనస్ అయ్యే ఛాన్స్ అయితే పక్కాగా ఉంది. అంతర్గత పోరు లేకుండా ఇక్కడ కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే మంచిర్యాలలో బీజేపీ అంత బలంగా లేదు. ఓటు బ్యాంకు కూడా అంతగా లేదు. ఐనప్పటికీ మంచిర్యాలలో ఉనికిని చాటుకునే ప్రయత్నంలో కమలం పార్టీ ఉంది. ఇక్కడ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. అయినప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లో విజేత ఎవరో తేలాలంటే కమలం పార్టీకి వచ్చే ఓట్లపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అంటే మంచిర్యాలలో బీజేపీని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి పరిణామాలు ఇలా ఉన్నా, ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగుంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం!!