వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వరంగల్ టైమ్స్, కడప జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. పులివెందులలో భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అందించారు. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డికి రెండు సార్లు నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. ఇప్పుడు భాస్కర్ రెడ్డి వంతు వచ్చింది. వాస్తవానికి భాస్కర్ రెడ్డికి గతంలోనే సీబీఐ నోటీసులు ఇచ్చింది.
గత నెల 23న విచారణకు రావాలని నోటీసులు పంపగా, ఆ రోజు వ్యక్తిగత కారణాలతో కుదరదని, మరో రోజు వస్తానని కోరారు. గత నెల 26న విచారణకు వస్తారని భావించినప్పటికీ ఆయన రాలేదు. కానీ తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసు రాలేదని భాస్కర్ రెడ్డి సన్నిహితులతో చెప్పారు. మరి ఈ నెల 12న అయినా భాస్కర్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ అందరిలో మొదలైంది.